అందుకే నువ్వంటే నాకు అసహ్యం

రంగులు మారే
ఆకాశంలో
కొత్త అందాలు
ఎలా శాశ్వతం  చెలి?

ఆకాశంతో పోల్చకు-
గొప్పతనాన్ని ఆపాదించకు-
అక్కర్లేదు.

నీ చిన్ని నవ్వుకోసం
పడే పాట్లలో
స్వార్థం కాక
నీకు గొప్పతనమెలా
కనబడింది??

నీ మూర్ఖత్వానికి
ప్రేమా అనే పేరు పెట్టుకుని
నిజం తెలుసుకోలేకున్నావు
నిన్ను కూడా తప్పు పట్టలేను
ఎందుకంటే - నిజమే.. ప్రేమంటే
నమ్మకం కదా !

అందుకే నువ్వంటే నాకు అసహ్యం
ఇక్కడ ఏది కూడా నిజం కాదు
నాతో కలిపి..

నువ్వు తప్ప,
బహుష !!...

నిజం తెలిసింది

నల్లని ఆకాశంలో
ఎర్రని మబ్బుల
విన్యాసాలు
అర్థం లేకుండా
తిరుగుతూనే ఉన్నాయి,
అక్షరాలు సిగ్గుపడేలా
ప్రపంచానికి తెలియని
సంఘటనలు
చూస్తూ..

కాలం కరుగుతూ
సమయం గడిచిపోయింది,


వెనక్కి తిరిగి చూస్తే
ఏమీ కనబడలేదు
నడిచిన దారి తప్పా,

జ్ఞానోదయమైంది ...



ఎందుకంటే



మనకన్న ముందూ ఉంది






మన తర్వాతా కూడా ఉంటుంది




ఈ " ప్రపంచం " !

ఈ మాయా మనసు...

మనసెపుడూ
మాట వినదు కదా !

నీతో గడిచిన నిన్నొక అధ్బుతం
ఇప్పటి ఈ క్షణంనేనెలా చెప్పను?
నాలోని మాటలకు జబ్బు చేసింది మరి.

కళ్ళు చెప్పిన బాసలు
గాలిలో కలిసి నీ ముంగురులను
నిస్తేజంగా తడుతుంటే
ఒళ్ళో ఉన్న  నీ వదనంలో
అదే నవ్వు నాలోని అణువణువునూ
 మైమరిపిస్తూ
నీ అభిజ్ఞాతంగా - ఏకాంతంగా..

నీ చేతనారహిత
హిమాంచు
నిశీదర్శనీత నయనాలు
చిందించే వెలుగుల
పగుల్లలోంచి ఎర్రని మంటలు
నా రోదనలో-
మెరిసే నక్షత్రాలు
నీవులేవని వెక్కిరిస్తున్నా
ఒప్పుకోలేకపోతోంది
ఈ మాయా మనసు...

ఔను ఈ మనసెపుడు
మాట వినదు కదా!!

చెల్లి నిస్సహాయత్వం!

పాపపు విజయాల కేరింతల్లో
పులకరింతల పరవశాన
మొహంలో  మోహం వికృతంగా
నడీ రోడ్డుపై గర్వంగా నర్తిస్తోంది.

అమాయక నా చెల్లి మొహంపై
వాడు విషాన్ని పోసాడు అందరి ముందు
అర్థమయ్యేలోపు
ఆ చెల్లి అయోమయపు రోదన
గుండెల్ని పిండేస్తుంటే
ఏమీ చేయలేని నిస్సహాయత్వం
చుట్టూ చేరి తమాషా చూస్తోంది.

ధరణేమి పాపంచేసుకుంటుందో కదా రోజూ
బయం బయంగా - తెలియకుండా,
ఇలాంటివాల్లు మన మద్యలో నిర్భయంగా
అందరినీ బయపెడుతూ
మస్తిష్కపు మూలాలు మాయమయి.

పాపమెరుగ ని ఆ చెల్లి  ఆవేదనకు
సమాధానమెవరు చెప్పాలో??

ఈశ్వరం!!

"ఆ" దారిలో వెల్తుంటే
ఏమైందో గాని
ఒక్క క్షణం మెదడులో
ఏదో మెరుపు,
అర్థం కాలేదపుడు!

        రాత్రి కలలో
        దేవుడు నాతో మాట్లాడుతూ
        చెప్పాడు.
        గాయమైన గేయంలా
        నాకు తెలియకుండానే
        ఏడ్చానేమో
        అప్పుడర్థమైంది!!

                ఎదైనా కావాలంటే
                మరేదో వదిలేయాలిగా...
                అవును-
                నాలో ధైర్యం కోసం
                నేను స్వార్థాన్ని వదిలేసాను,
                కప్పుకున్న పొరలు వీడి
                హరి కరముల స్పర్షలా
                ఈశ్వరం నన్నావహించి
                చాలా  ప్రశాంతత!!!

కాలుతున్న కలల తడి!

జ్వలించే కాలం
నెమ్మదయి
నిశ్శబ్ధ నిశీలోన
మెల్లిగా  ఎగసి ఎగసి
కాలుతున్న  కలల తడి  లోన
మెరుస్తూ
మంచు తెరల్లో
క్షణాలతో యుద్ధం
నిర్విరామంగా
జరుగుతూనే ఉంది!

ఉశోదయాలు
సంధ్యా దీపికలు
            కరువయ్యి
చల్లని గాలి
            సవ్వడి కూడా
సమర సమీరంలా !!

పొసగని
అడుగుల అమరికలో
ఏదో తేడా
మన జీవన కుహూ రాగాలు
అడవి గీతాలయ్యాయి

స్వప్నాల సాలెగూడులో
జరిగే అస్థిత్వపు పోరాటంలో
ఎంత చీల్చుకొన్నా
బరువు క్షణాల
వెక్కిరింపుల సవ్వడిలో
రోదన మౌనమయి
శుశ్క దేహపు
ఆహార్యం మిగిలి
గమ్యమే లేని
చివరి ప్రయణం మొదలయ్యింది!!!

అదిగో సముద్రం కూడా
తెల్లని ఉవ్వెత్తున లెగిసే
అలలతో స్వాగతం నాకోసం!!!!

మార్పు నా ఆశ..

మార్పు నా ఆశ..


సైద్ధంతికపరమైన
ఆలోచనలు
పుట్టించేవి తీవ్రవాదం కాదు-కారాదు
ఉత్తేజిత చైతన్యం మాత్రమే కావాలి.
ఒక మంచి ఆలోచన
సామజిక రూపం
సంతరించుకోవాలంటే
బాధ్యతాయుతమైన
నిబద్దత ఉండాలి-కల్మషంలేని
ఉద్రేకం కావాలి
ప్రతీ క్షణం ప్రతీ మాటలో
అర్థం ఉండాలి
అప్పుడే కదా మార్పుకు అవకాశం.

కావల్సిందల్లా బాధ్యతాయుతమైన ప్రయత్నాలు కావాలి
మార్పు అదే వస్తుంది ఒకరోజు తప్పకుండా.
అదీ నా ఆశ.

ఆగిన పరుగు

ఆలోచనల మబ్బులు మనసును కమ్ముకున్నపుడు క్షణాలు బరువవుతూ కాలం ఆగేలా ఉంది కదా..
నిజమే నిజం రాక్షసిలా నీ ఎదురుగా ఉన్నపుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు.
పక్షి రెక్కలు తెగి దార్లో కనబడినపుడు నీ కళ్ళల్లో నీటిని ఎవరైనా ఆపగలిగారా?ప్రాణం విలువ తెలిస్తే మనిషితనానికి దైవత్వం కూడా ఆబ్బుతుంది కదా.
కురు ఆలోచనలను కాల్చేసి అస్తికలను ఆకాశంలోకి విసిరి కొట్టు గాలిలో కలిసిపోతాయి నామరూపాల్లేకుండా.
ఇక్కడ అసలే చీకటి కదా, ఇంకా ఈ ముసుగుల్లో రంగులాటలెందుకు?వెలుగు కావాలి అర్థమ్ కావట్లేదా నీకు?

అక్కడ చూడు... నాకు నవ్వొస్తుంది ఆ చోద్యపు ఆటలు.
ఇక్కడ పగటివెలుగులెక్కువ,
నీ ఆలోచన  జ్వాల వెలుగులు ఇక్కడ కనబడవు,
నిజానికి అక్కర్లేదు కూడా..

నీ అరుపులు కేకలు,ఏడ్పుల కన్నా ఊరవతల చీకటి వేడి నిట్టూర్పులకు ఉండే విలువ ఎక్కువ... అది నిజమే కదా .

ఈ వేగపు వేడి పరుగుల్లో ఎక్కడికక్కడ మానసికంగా మాడిపోతున్నారు రోజు అదే జీవితమనుకుంటూ,
చుట్టూ చూస్తే అన్నీ మృత కళేబరాలే కనబడుతూ అసహ్యంగా ఉంది.
కుండీ పక్కనే పిల్లోడు ఆడుకుంటూన్నాడు బోసి నవ్వుల్తో, నన్ను చూస్తూ చేతులు చాచి మళ్ళీ నవ్వాడు ఆ నవ్వులో నాకు దేవుడు కనబడ్డాడు.
మనసులో కల్లోలం తగ్గినట్లైంది ఇప్పుడు ఏం చేయాలో కూడా తెల్సింది నాకు ఇక్కడ. కాని....
హటాత్తుగా నాకు ఏమీ వినపడక-ఏమీ కనపడకుండా ఉందేంటీ????

అర్థం కాకుండా ఉంది

నీ మాటలను
నిజమనుకుని
నీ నవ్వులో నేను
తడిసి ముద్దయ్యాను...


నీ పైన అభిమానం నన్ను
నిస్తేజుడను చేస్తే
నువ్ నాకు
ఆశల రెక్కలు తొడిగావు .
మబ్బుల్లో కూరుకుపోయాను ..


చూస్తే నువ్వెక్కడా లేవు
నీ ఆశలూ లేవు నాకు..

అంతా సంతోశమే నిన్నటి వరకు

అంతా సంతోశమే నిన్నటి వరకు
ఇవాల నువ్ లేవు-నీ నవ్వు కూడా
అమరమైన అభిమానం
ఆకాశంలో
నక్షత్రమై మెరుస్తోంది.
విశాల కక్ష్యలో
ఎక్కడని వెతకను
కన్నుల్లో కమ్ముకున్న కన్నీళ్ళతో.

ఖాలీ అయిన గుండెలో
మంటలు నన్ను
దహిస్తున్నాయి
దేవదాసును కాలేను
మత్తులో జోగడానికి
నిన్ను మర్చిపోవడానికి

కొండ చివర
కాలు జారుతుందేమో
ప్రళయం పక్కన.

నీ అర చూపు

సిగ్గుపడ్డ నీ మోములొ
ఎరుపెక్కిన చెక్కిలిపై
ముంగురులు నాట్యమాడగా
నీ పెదవులపైన
కొంటె నవ్వు.

కనులెత్తి చూసిన
నీ అర చూపులో
ఆశ్చర్యం

నువ్ చూస్తున్న
అద్దంలో
నీకు బదులు

నేను...

ఎలా చెప్పను?

ఇష్టాన్ని
ప్రేమనుకోలేదు మనం,
అంగీకార బందం
మన ఇష్టాన్ని పెంచింది
అందుకే.

కాని

అవసరాలు
నీ ఆలోచనలను
మార్చాయేమో
దూరమయ్యావు.

ఏడుపు రాలేదు
నీ మీద ఇంకా
ఇష్టం పెరిగింది
స్వతంత్రురాలివయ్యావని.

ఐనా,..
వర్షాకాలపు
చిగురుటాకు చివరన
చినుకుతడిలా
నీ జ్ఞాపకాలు
నా గుండెలో
అలాగే ఉన్నాయి ఇప్పటికీ.

ఆకాశం కొత్తగా ఉంది !

వేకువ జామున
తూర్పు ఆకాశం కిటికీలోంచి
కొత్తగా ఉంది,

చూస్తూనే ఉన్నాను!

పక్షులెగురుతుండగా
మసక చీకటి చివరన
సూర్యోదయం..
రెండు కళ్ళు చాలవేమో
ఆస్వాదించడానికి.

అలికిడయితే పక్కకు చూసా
అక్కడ నవ్వుతూ నువ్వు
నీ చిరునవ్వుల్లో పువ్వులు,
ఇంకెన్ని కళ్ళు కావాలో
నీ అందాన్ని
ఆస్వాదించడానికి..
ఒక్కసారిగా అయోమయం
అటు తూర్పును చూడాలా
ఇటు నిన్ను చూడాలా??

తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాను
ఆ ఆకాశంలో
ఉదయిస్తున్న సూర్యుడి పక్కన
నవ్వుతూ.. నన్నే చూస్తూ ...
నువ్వే!!!

నాన్న గుర్తొస్తున్నాడు.

నాకు ఇంకా గుర్తుంది.
ఆ రోజు నువ్ నా చేయి పట్టుకుని
స్కూల్ లో జాయిన్ చేసావు,మాస్టారుతో
అన్నావు మావోడు గొప్పోడు కావాలనుందని!

కాలం గిర్రునా తిరిగిపోయింది
ఎన్నో తప్పులు - ఒప్పులు
పంతాల పట్టింపులతో...!

ఒకసారి డబ్బడిగాను ఎక్సర్షను కు వెళ్ళాలని
లేవన్నావు - నాకు తెలుసు నీదగ్గర డబ్బులేదని
 కాని కావాల్సిందే అంటే
ఏదో అమ్మి నాకు ఇచ్చ్చావు
నేను నవ్వితే సంతోశించావు.

ఆ రోజు నా తలకు దెబ్బతగిలితే
నువ్ పడ్డ భాధ నాకు ఇంకా గుర్తుంది
అది నాకు ఇపుడు అర్థమవుతుంది.

నీతో కూర్చోబెట్టుకుని బ్రతకడం నేర్పాలనుకున్నావ్
కాని ఆ దేవుడికి నీతో ఏ పని బడిందో
అకాల పక్షవాతం తో నిన్ను మంచానా పడెసి
డబ్బులేని స్థితిలో
హీనమైన చావునిచ్చాడు. చివరిసారిగా అన్నవు
మంచిగా ఉండు - అని.

నువ్ పోయాక
ఇక్కడి హడావుడి రేస్ లో పడి
అన్నీ మర్చిపోయాను నాన్న, చివరికి నిన్ను కూడా.
నేను బయపడీనప్పుడల్లా నా వెన్ను తడుతూ
ఏమి కాదూ అంతా ఉత్తిదే అంటూ నాకు నువ్విచ్చే ధైర్యం
నాకు లేదిపుడు.

పెద్దన్నయ్య వదినా వాళ్ళ పిల్లలు బాగానే ఉన్నారు నాన్న
అలాగే చిన్నన్నయ్య కూడా. ఇక తమ్ముడు
చెప్తే నమ్మవు కాని వాడినందరూ " జెమ్ " అంటున్నారు
ఇక అమ్మ నన్ను నువ్ స్కూల్ కు తీస్కెల్లేరోజు
ఇంటి పనులతోఎంత బిజీగా ఉందో-ఇప్పటికి అలాగే ఉంది
నేను కూడా పెళ్ళి చేసుకుని బాగానే ఉన్నాను.
ఇప్పుడు నువ్ ఉంటే ఎంత బాగుండెదో నాన్న

నీకు ఏమీ చేయలేక
ఋణగ్రస్తుడనయి
కళ్ళు తడవకుండా ఏడవడం నేర్చుకున్నాను
నువ్ గుర్తొచ్చినపుడల్లా...

ఇక్కడంతా అదోలా ఉంది
నువ్ చెప్పిన మోరల్ కధల్లోలా
ఎవరూ లేరు,
నువ్ నా పక్కనున్నపుడు ఉండె ధైర్యం లేదిపుడు నాకు.

ఎవరైనా నన్ను దేనికోసమైనా అడిగితే
"మా నాన్ననడిగి చెప్తానని" చెప్పలనుంది నాన్న.

నువ్ గుర్తొస్తూ నీకు ఏమీ చేయలేకపోయిన
నా మీద నాకే కోపంగా ఉంది.
నన్ను సైకిలెక్కించుకుని బళ్ళో దిగబెట్టేటపుడు
నువ్ నాకు హీరోవి అపుడు

నిన్ను కార్లో తిప్పాలనుంది నాన్న

కాని నువ్ లేవు ఇపుడు !!

ప్రేమ !?!...

మొదలు  " కొత్త"
తరువాత ఉత్సాహం
తరువాత మురిపం
తరువాత బులపాటం
తరువాత గడసరితనం
తరువాత కోపాలు తాపాలు
తరువాత బేలతనం
తరువాత పంతం
తరువాత గర్వం
తరువాత పొగరు
తరువాత అహం
తరువాత జగడం
తరువాత బాధ
తరువాత మౌనం
తరువాత నిర్వేదం
చివరగా జీవితంతో సర్దుబాటు.