అన్నీ కంప్లైంట్సే నిన్నటివరకు.

ప్రపంచంలో అన్నింటిపైనా,అందరితోనూ, అన్నీ కంప్లైంట్సే నిన్నటివరకు.
ఇన్ని సంవత్సరాల ఆలోచనలన్నీ మెదడు పొరలను చీల్చుకుని బయటికొస్తే బయపడ్డాను, కాని ఈ ప్రపంచంలో ప్రతీదానికి ఉండే మరో కోణంనుండి చూస్తే చాలా నిరర్థకంగా కనబడి, నా సంతోషాలన్నీ అనుకోకుండా వచ్చినవే అని, వాటి కొరకు నేను చేసిన ప్రయత్నాలు గాని పడ్డ ఆరాటం గాని కారణాలుగా కనబడలేదు.

అలాంటపుడు నా సమయాన్నెందుకు వ్యర్థం చేసుకోవడం? .... నాలోని నన్ను సమీకరించుకున్నాను.
నేనేంటో నాకు తెలుస్తుందిపుడు, అప్పుడర్థమైంది ఈ ప్రపంచమంటే నేనే అని - నామీద నాకే ఇన్నిరోజులుగా కంప్లైంట్స్ అని.
అన్నింటీనీ ఒక్కొక్కటిగా చీల్చి చూస్తుంటే రకరకాల పరిష్కారాలు కనబడుతూ నాలోని అలజడులు ఒకటొకటిగా తొలగిపోతూ దక్షిణాయనం పోయింది.

చల్లని గాలి శబ్దమొస్తే నా కిటికీ తెరిచాను, తూర్పు  సూర్యుని లేత కిరణాలు నా మొహాన్ని వెచ్చగా తాకాయి.