అమ్మ నీకు దండాలమ్మ మౌనంగా ఉండకమ్మ.........

రత్న గర్భ అని నీకు పేరు
ఐన రైతన్నల గుండె ఘోష లో
నిరాశలు నీకు పట్టవా?

నిన్ను నమ్మి
హలాల కోరలతో
నిత్య పోరాటాలు చేస్తూ
నిన్ను తడుపుతూ
కడుపు నింపుకోవాలనుకునే
బడుగు జీవాల ఆర్తనాదాలు
నీకు వినబడటం లేవా తల్లీ?

అన్నెమెరుగని పిల్లవాని
అమాయకమైన చూపుల్లోని
వారి భవిశ్యత్తు కాస్తైన కనబడవా నీకు?

నిన్ను పచ్చ చీరతో చూడాలనే ఆశతో
రాత్రి పగలు నిన్ను ముస్తాబు చేయడానికై
స్వేదకాయాలతో పరితపించే నా అన్నల
కన్నుల్లో ఆశలు నీకెందుకు పట్టవు అమ్మా?

ప్రకృతి జత కట్టి
తమ జీవితాలను పణంగా పెట్టి
ఆడుకుంటున్న రైతన్నలకు
నీ చల్లని చూపులు
ప్రసరించు తల్లీ....

అమ్మ నీకు దండాలమ్మ
మౌనంగా ఉండకమ్మ.........

కన్నీళ్ళు పెడుతోంది ఈ చితి..

గరిక పొదళ్ళో మాటు వేసిన
అందమైన భ్రమల్లో
రాని చినుకులకై
ఎండమావుల్లో
ఎదురుచూపు.!

స్వాభిమానపు కబందహస్తాల్లో
చిక్కి,కేకలు పెడుతున్న
ఆవేశం,
కట్టడుల ధుర్భర కోటకెదురుగ
ముందడుగులేని దారి.!!

బంగారు కలల్లో
పడి-నలిగి, మెరుపు ఎగిరి
పాడైపోతున్న బాల్యపు
అసహాయతల
సమాజపు వైతరిణిలో
ఈదుతున్నపుడే తెలిసింది
చచ్చి అపుడే చాలా కాలమైందని.!!

అన్నీ తెలిసి
కన్నీళ్ళు పెడుతోంది
నన్ను కాలుస్తున్న ఈ చితి..

ఐనా నీ మనసు అద్దమోలే మెరుస్తూ......

అక్షరహీనమైన భావాల ప్రవాహం
నిర్లజ్జమైన ముసుగు నవ్వుల కోళాహాలం
హాహాకారాల వికృత ధ్వనుల అభ్యుదయం
ఎర్రని మంటల్లో కాగితపు నమ్మకాలు
ఆవిరవుతున్న కన్నీళ్ళ ఏడుపులు
నవసమాజపు నిర్మాతల చేతులకు సంకేళ్ళు
అయ్యో గంగమ్మా..!! ఎందుకు నీ ఉరుకుల ప్రవాహం???

మనసు పోరాటంలో ఓడి నేను
గంగమ్మ ఒడిలో శాశ్వతంగా...

ఒడ్డున నువ్వు ఎందుకో నవ్వుతూ
ఐనా నీ మనసు అద్దమోలే మెరుస్తూ......