Monday, April 30, 2012

నీ కోసం

నీ కోసం నేను నిరంతరం చేసే 
క్షతగాత్రమైన ఆలోచనలు 
చివరికి దారి తెన్నులు తెలియకుండ
ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్నవి
ప్రతీ క్షణం ....

Monday, April 2, 2012

మా ఊరి పిల్ల కాలువ...

మా ఊరి పిల్ల కాలువ పక్కనే
నడుస్తుంటే, చల్లటి గాలితో
సన్నటి వాన మొదలైంది..

కాస్త ముందుకెళ్లి కాలికింద
నలుగుతున్న మట్టిని చేతుల్లోకి
తీసుకుని చూస్తుంటే
ఎందరో సమర యోదుల నెత్తుటి వాసన..

స్వేచ్ఛను , స్వాతంత్ర్యాన్ని
అపహాస్యం చేస్తున్న ఇప్పటి
రాజకీయాలను చూస్తూ ఆ
మట్టి కూడా రోధిస్తుందేమో
నా వేళ్ళ సందుల్లోంచి మట్టి నీరు
ఎర్రగా .... 

Saturday, January 21, 2012

అన్నీ కంప్లైంట్సే నిన్నటివరకు.

ప్రపంచంలో అన్నింటిపైనా,అందరితోనూ, అన్నీ కంప్లైంట్సే నిన్నటివరకు.
ఇన్ని సంవత్సరాల ఆలోచనలన్నీ మెదడు పొరలను చీల్చుకుని బయటికొస్తే బయపడ్డాను, కాని ఈ ప్రపంచంలో ప్రతీదానికి ఉండే మరో కోణంనుండి చూస్తే చాలా నిరర్థకంగా కనబడి, నా సంతోషాలన్నీ అనుకోకుండా వచ్చినవే అని, వాటి కొరకు నేను చేసిన ప్రయత్నాలు గాని పడ్డ ఆరాటం గాని కారణాలుగా కనబడలేదు.

అలాంటపుడు నా సమయాన్నెందుకు వ్యర్థం చేసుకోవడం? .... నాలోని నన్ను సమీకరించుకున్నాను.
నేనేంటో నాకు తెలుస్తుందిపుడు, అప్పుడర్థమైంది ఈ ప్రపంచమంటే నేనే అని - నామీద నాకే ఇన్నిరోజులుగా కంప్లైంట్స్ అని.
అన్నింటీనీ ఒక్కొక్కటిగా చీల్చి చూస్తుంటే రకరకాల పరిష్కారాలు కనబడుతూ నాలోని అలజడులు ఒకటొకటిగా తొలగిపోతూ దక్షిణాయనం పోయింది.

చల్లని గాలి శబ్దమొస్తే నా కిటికీ తెరిచాను, తూర్పు  సూర్యుని లేత కిరణాలు నా మొహాన్ని వెచ్చగా తాకాయి.

Monday, December 5, 2011

రహస్యం....



కళ్ళు తెరిచి చూస్తే
చుట్టూ నువ్వే,
తేలిగ్గా అనిపించి
నన్ను నేను చూసుకుంటే
రూపం లేకుండా
అసలేమీ కనిపించట్లేదు
"నేను" లేను.
కాని అంతా తెలుస్తుంది.

చుట్టూ అందమైన చెట్లు
సువాసనలతో ఉంది
అపుడపుడు
వర్ణణకతీతమైన జీవుల
పలకరింఫులతో
ఆహ్లాదంగా ఉన్నపుడు
అకస్మాత్తుగా నువ్వు కనిపిస్తున్నావ్.
మళ్ళీ అపుడే మాయమవుతున్నావు.

అంతా అయోమయంగా ఉంది
కాని అంతలోనే రహస్యం తెలిసింది

ఇదంతా నీ "ఆలోచనే".......

Sunday, October 23, 2011

ప్రతీ రోజు చస్తున్నాను రా "చే"గువేరా

ఏది చీకటి ఏది వెలుగు
ఏది జీవితమేది మృత్యువు?
నేతి బీరకాయలో నేతియే కదా అన్నీ
అనుకుంటూనే ఉంటున్నాను

కానీ కాని,
నీవొక శిఖరం
నీ ఆలోచనలు ఎవరికీ అందనివి
నీ కళ్ళల్ల్లోకి సూటిగా చూడలేను
నీ నిజాయితీ మంటల్లో మాడిపోతానని
అదిగో ఆ సూరీడు నువ్ లేక
తూర్పున లేనే లేడు
నీ మాటల వేడిలో
నా అస్థిత్వం పొరలవుతున్నాయి
నిన్ను నేను ఎప్పటికీ ద్వేషిస్తాను
నీలా ఉండనివ్వని ఎత్తుకెగిసావని
ఐనా నీవొక అనంతం..

 నీలా ఉండటానికి
ప్రతీ రోజు చస్తున్నాను రా
"చే"గువేరా
నా చుట్టూ ఉన్న నాజీలా సాక్షిగా...

నిన్నెప్పటికీ మరువని
నీ నేను.

Friday, October 14, 2011

నీ చూపుల శాసనాల్లో

నీ చూపుల శాసనాల్లో
చిక్కుకుని చీకటి
అభిమానపు గుహల్లో
నీ ఆలోచనల
సంకేళ్ళేసుకుని
ఉనికి లేని బంధీగా
దృష్టికోల్పోయి శూన్యంలో
బరువు లేని రేణువునయ్యాను చివరికి.

చిద్విలాసంగా నవ్వుతూ నువ్వు!!!

Thursday, October 6, 2011

అప్పుడే జ్ఞానోదయమయింది నాకునేనే నిజమని నాకొరకు ఎవరూ ఉండరని.

నేనున్నపుడు సంతోశంగా ఉండి
నా కోసం ఏమైన చేయడానికి సిద్ధపడే వాళ్ళు
నేను లేనపుడు నా కొరకు చావాలనుకునేవారు
ఒక్కరైనా ఉన్నారా ఈ సృష్టిలో అని ఆలోచిస్తే
నాకెవరూ కనబడటం లేదు
చివరికి నా తల్లి,భార్యా ,
నన్ను ఇష్టపడ్డానన్న మరో అవిడ కూడా!

అప్పుడే జ్ఞానోదయమయింది
నాకునేనే నిజమని
నాకొరకు ఎవరూ ఉండరని..

ఈ బందాలు అనుబందాలూ అబద్దాలని
అవి కేవలం అవసరాల కొరకు మాత్రమే అని

ఆ క్షణం నుండి మొదలైన
నా అన్వేషణ సాగుతూనే ఉంది ఇంకా
సూర్యుడు తూర్పున ఉదయిస్తూనే ఉన్నాడు

నాలోని ఆలోచనలు చిక్కబడుతున్నాయి
అనుకోకుండా నాకు దిగులు మొదలయ్యింది
ఏదో ఒక రోజు నేను కూడా చనిపోతానని.

ఒక్కసారిగా ఆలోచనలు పొరల్లా తేలిపోతున్నాయ్
ఇంకోసారి ఆవిరవుతున్నాయ్.

నా అన్వేషణ ఇంకా అలాగే సాగుతుంది
పట్టుదలతో !!!